సినిమా సెలబ్రిటీలన్నాక ఎవరో ఒకరిని కలవకుండా ఉంటారా? లంచ్‌లకూ, డిన్నర్‌లకూ వెళ్లకుండా ఉంటారా? మామూలుగా అయితే, వెళ్లిన ప్రతిసారీ ఎవరూ ఏమీ అనరు. ఆ వెళ్లడంలో స్పెషాలిటీ ఉంటే మాత్రం ఏదో ఒకటి చెవులు కొరుక్కోకుండా ఉండరు. ఇప్పుడు పరిణీతి విషయంలోనూ జరుగుతున్నది అదే. ఆప్ ఏంపీ రాఘవ్ చద్దాతో లంచ్‌లకూ, డిన్నర్‌లకూ వెళ్తూ పాపరాజీల కంట పడ్డారు పరిణీతి చోప్రా. సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
పరిణీతి దీని గురించి చెప్పకపోయినా, ఆమె సన్నిహితులు మాత్రం అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ పరిణీతి పెళ్లి గురించి ప్రస్తావించారు. తనకు తగిన సంబంధం ఉంటే చెప్పమని ఓపెన్‌గానే అనేశారు. పరిణీతికి, రాఘవ్‌కీ మధ్య ఏదో ఉందని కొందరు అంటే, ఏమీ లేదన్నది మరికొందరి వాదన. వారిద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కలిసి చదువుకున్నారట.
అంతకు మించి ఇంకేమీ లేదన్నది ఇప్పుడు వైరల్ అవుతున్న పాజిటివ్ విషయం. పెళ్లి మీద మాత్రం పరిణీతికి అపారమైన నమ్మకం ఉంది. పెళ్లి గురించి మాట్లాడుతూ "నాకోసం మంచి అబ్బాయిని వెతికిపెట్టండి. నా మనసులో ఎవరూ లేరు. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోవాల్సిందే. పిల్లల్ని కనాల్సిందే. అదేదో విసిగిపోయి చెబుతున్నానని అనుకోకండి. నాకు పెళ్లిమీద, పిల్లల మీద గౌరవం ఉంది. ఇష్టం ఉంది. అమ్మాయి జీవితంలో వాటికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని నాకు తెలుసు. నా కెరీర్‌ని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలన్స్ చేసుకునే పరిపక్వత నాకు ఉంది. జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా నేను సరిదిద్దుకోగలను. ఆరోగ్యంగా ఉంటాను. నా ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని ఆనందంగా చూసుకుంటాను" అని అన్నారు పరిణీతి.
ఆమె ఫ్రెండ్స్ అందరూ పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ "వాళ్లు చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. కలిసి ఉన్నారు. అందుకే నెక్స్ట్ స్టెప్‌గా పెళ్లి చేసుకున్నారు. నేను ఇంకా నా వ్యక్తినే కలవలేదు. ప్రేమించలేదు. కలిసి లేను. అప్పుడే పెళ్లేంటి? ఇవన్నీ జరిగాక తప్పక చేసుకుంటా" అని చెప్పారు.